April 2, 2026

ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లైన.. 50 రోజుల్లోనే ఆత్మహ్యత!

sucide girl1

హైదరాబాద్‌లో మరో కట్న వేధింపుల విషాదం వెలుగులోకి వచ్చింది. ప్రేమించి, కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్న ఓ యువతి.. పెళ్లైన కేవలం 50 రోజుల్లోనే ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపుతోంది. అదనపు కట్నం కోసం భర్త వేధించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన నగరంలోని మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.

ఫేస్‌బుక్ పరిచయం.. ప్రేమగా మారిన బంధం

ప్రాథమిక సమాచారం ప్రకారం, బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. సుమారు ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో, ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 10న పట్నాలో వివాహం చేసుకున్నారు. నీరజ్ కూడా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.

వివాహం అనంతరం ఇషికకు కూడా హైదరాబాద్‌కు బదిలీ రావడంతో, దంపతులు మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తూ ఉద్యోగాలు కొనసాగించారు. అయితే, పెళ్లైన కేవలం 50 రోజులకే ఈ బంధం విషాదాంతమైంది. బుధవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఇషిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.

Read this article also: కేరళ సీఎం విజయన్, ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

‘అదనపు కట్నం కోసం వేధింపులు’.. కుటుంబ సభ్యుల ఆరోపణ

మృతురాలి తల్లిదండ్రులు మాత్రం ఇది సాధారణ ఆత్మహత్య కాదని, అదనపు కట్నం కోసం భర్త వేధింపులు కారణమని ఆరోపిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, పెళ్లి తర్వాత పరిస్థితులు మారిపోయాయని, మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఈ దారుణ నిర్ణయం తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, దాంపత్య జీవితం, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబం చేసిన ఆరోపణల నేపథ్యంలో, కట్న వేధింపులు, గృహహింస కోణాల్లో కూడా కేసును పోలీసులు పరిశీలిస్తున్నారు.

టెక్నాలజీ, విద్య, ఉద్యోగాల్లో ముందుకు వెళ్తున్న సమాజంలో కూడా కట్నం అనే సామాజిక వ్యాధి ఇంకా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తూనే ఉంది. ప్రేమ వివాహం అయినా, ఏర్పాటుచేసిన వివాహం అయినా.. పెళ్లి తర్వాత ఆర్థిక డిమాండ్లు, మానసిక వేధింపులు, గృహహింసలు యువతుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన కూడా అలాంటి బాధాకర వాస్తవానికే మరో ఉదాహరణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *