March 30, 2026

బాధితుల వేడుకోలు.. కలెక్టర్ తక్షణ స్పందన

 చిత్తూరు PGRSలో ప్రజా సమస్యల వెల్లువ!

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షతన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. వ్యయప్రయాసలకోర్చి జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన బాధితులు తమ గోడును కలెక్టర్‌కు వివరించారు. అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్, పలు సమస్యలపై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ తక్షణ పరిష్కారానికి బాటలు వేశారు.

ఆలకించి దయచూపండయ్యా..! క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల వివరాలు

నేటి కార్యక్రమంలో భూ వివాదాలు, పెన్షన్లు, అక్రమ కట్టడాల ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అందరినీ కలచివేసిన కొన్ని ప్రధాన ఫిర్యాదులు:

దివ్యాంగుడైన బాలుడికి పెన్షన్ భరోసా: పెనుమూరు మండలం గంగుపల్లెకు చెందిన ఎం. పార్థివ్ చౌదరి అనే బాలుడు పుట్టుకతోనే దివ్యాంగుడు (90% వైకల్యం). తన కుమారుడికి పెన్షన్ ఇప్పించాలని తండ్రి జ్యోతిశ్వర్ నాయుడు వేడుకోగా, కలెక్టర్ వెంటనే స్పందించారు. జిల్లా వైద్య శాఖాధికారి (DMHO) మరియు DRDA PDలు సంయుక్తంగా రికార్డులను పరిశీలించి, అర్హత మేరకు తక్షణమే న్యాయం చేయాలని ఆదేశించారు.

నిబంధనలకు విరుద్ధంగా కోళ్ల షెడ్డు నిర్మాణం: యాదమరి మండలం కుక్కలపల్లిలో నివాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా కోళ్ల షెడ్డు నిర్మిస్తున్నారని కె.చంద్రకళ ఫిర్యాదు చేశారు. గతంలో నిలిపివేసిన పనులను మళ్ళీ దౌర్జన్యంగా ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. రెండు రోజుల్లోపు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని చిత్తూరు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

దేవాలయ భూమి వివాదం: గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురంలో ఇందిరమ్మ పథకం కింద కేటాయించిన భూమిలో గ్రామ దేవత గుడి నిర్మిస్తుంటే, కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని వి.జానకి రామన్ కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై దేవాదాయ మరియు రెవెన్యూ శాఖాధికారులు స్వయంగా స్థలాన్ని పరిశీలించి వాస్తవ నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

స్మశాన భూమి ఆక్రమణలపై ఊరి ప్రజల ఫిర్యాదు: పలమనేరు మండలం వడ్డూరు గ్రామానికి చెందిన 100 కుటుంబాలకు స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నామని, ఉన్న భూమిని కొందరు ఆక్రమించుకున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

#Chittoor #PGRS #CollectorSumitKumar #PublicGrievance #APGovt #ChittoorDistrict #JusticeForPeople

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *