
సిద్దిపేట, జూన్ 6: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దాసోహం అయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ (Cabinet) సమావేశం ఎటువంటి ప్రయోజనం లేకుండా తీవ్ర నిరాశకు గురిచేసిందని హరీష్ రావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను (Six Guarantees) పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు గాలి మోటార్‌పై తిరుగుతూ, గాలి మాటలు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. తాము ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారని, అది తీవ్ర నిరాశనే మిగిల్చిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ (DA – Dearness Allowance) ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని, దీనిపై క్యాబినెట్లో ఐదు గంటలపాటు చర్చించడం అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను నిట్టనిలువునా ముంచుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ (BRS) పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. సక్రమంగా పనిచేస్తున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి, గ్రామాభివృద్ధికి పాటుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డిని మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధమేనని, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌లు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహం అయ్యారని హరీష్ రావు ఆరోపించారు.
రైతులను దెబ్బతీసేలా క్రాఫ్ హాలీడే (Crop Holiday)ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, 65 టీఎంసీల నీటిని ఉపయోగించకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు నిలదీశారు. అలాగే చంద్రబాబును ఎదురించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు.
గోదావరి బనకచెర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్లనున్నదని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. శ్రీశైలం రైడింగ్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కోరారు. కాళేశ్వరం కుప్పకూలిందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి గంగమళ్లకు నీటిని ఎక్కడి నుంచి తెస్తారని హరీష్ రావు ప్రశ్నించారు.