March 10, 2026

ఫ్యాక్టరీల సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాలని బీఎంఎస్ డిమాండ్

విశాఖపట్నం, జూన్ 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదించిన ఫ్యాక్టరీల సవరణ బిల్లు 2025ను వెంటనే వెనక్కు తీసుకోవాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) డిమాండ్ చేసింది. గాజువాకలోని ఓ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో BMS జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. జగదేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు మాట్లాడారు.

వారు పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ సవరణల వల్ల కార్మికుల హక్కులు సీరియస్‌గా ఉల్లంఘించబడుతున్నాయని, ఇది బ్రిటిష్ పాలనను గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, ఓవర్‌టైమ్ (Overtime) గంటలు 50 నుంచి 144కు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. దీంతో ప్రతి కార్మికుడు రోజుకి 5 గంటలు అదనంగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఇద్దరు కార్మికులు చేయాల్సిన పనిని ఒక్కరితో చేయించాలన్న నిర్ణయం కొత్త ఉద్యోగ అవకాశాలను (Employment opportunities) తీవ్రంగా తగ్గించేదిగా ఉందని విమర్శించారు.

మహిళా కార్మికులను రాత్రి పూట పని చేయడానికి అనుమతించడాన్ని భారతీయ సంప్రదాయాలకి విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే, విశ్రాంతి సమయం (Rest time) 10.30 గంటల నుండి 12 గంటలకు పెంచడాన్ని, రోజువారీ పనిగంటలు 9 నుండి 10 గంటలకు పెంచడాన్ని కార్మిక హక్కులపై ఘాతుకంగా అభివర్ణించారు.

ఈ బిల్లును వెనక్కు తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో BMS రాష్ట్ర కార్యదర్శి కె. లోవరెడ్డి, కోశాధికారి లాలం ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు రొక్కం సురేష్ కుమార్, స్టీల్ ప్లాంట్ యూనియన్ అధ్యక్షుడు ఓ. హనుమంతరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *