బీజాపూర్ అడవుల్లో రెండో రోజు ఎన్‌కౌంటర్: పెరిగిన మావోయిస్టుల మృతుల సంఖ్య!
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్ రెండో రోజుకు (ఆదివారం, 18-01-2026) చేరింది. నిరంతర కాల్పుల అనంతరం మృతుల సంఖ్య మరింత పెరిగింది.
రెండో రోజూ కొనసాగిన కాల్పులు.. మొత్తం ఆరుగురు హతం
శనివారం ఉదయం ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిసర అటవీ ప్రాంతంలో ప్రారంభమైన ఈ ఎదురుకాల్పులు ఆదివారం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం. శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించగా, ఆదివారం ఉదయం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దీంతో రెండు రోజుల్లో మొత్తం మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. మరణించిన వారిలో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ డివిజనల్ కమాండర్ దిలీప్ బెడ్జా (Dilip Bedja) తో పాటు మాడ్వి కోసా, లక్కి మడ్కం, రాధా మెట్ట అనే కీలక నేతలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా మావోయిస్టు పార్టీలో వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఘటన స్థలం నుంచి ఏకే-47, ఇన్‌సాస్ రైఫిల్, కార్బైన్ మరియు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, మావోయిస్టు సాహిత్య సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఆపరేషన్ కగార్.. కేంద్రం డెడ్ లైన్
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31, 2026 గడువు లోపు దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పోలీసులు, సిఆర్పిఎఫ్, కోబ్రా దళాలు ‘ఆపరేషన్ కగార్’ను మరింత వేగవంతం చేశాయి. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ నేతృత్వంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు ఇంకా అడవిని జల్లెడ పడుతున్నాయి. మరికొంతమంది మావోయిస్టులు ఆ ప్రాంతంలోనే చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు బాస్తర్ రీజియన్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో సుమారు 20 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా జరుగుతున్న ఈ దాడులు మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి, అదనపు బలగాలను రంగంలోకి దించారు.
#BijapurEncounter #MaoistFreeIndia #OperationKagar #ChhattisgarhNews #BreakingNews

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
