March 30, 2026

బాలకృష్ణ భావోద్వేగ ప్రసంగం: “అవును నాకు పొగురే…!”

హైదరాబాద్, జూన్ 10: తన 65వ పుట్టినరోజు సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ మంగ‌ళ‌వారం తన తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇది బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో జరిగింది. అనంతరం బాలకృష్ణ క్యాన్సర్ బాధిత చిన్నారులతో కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ తన మనసులో మాటలను అభిమానులతో పంచుకున్నారు. “నా జీవితం తెరచిన పుస్తకం లాంటిది. ఏ రహస్యాలూ లేవు,” అంటూ భావోద్వేగంగా ప్రారంభించిన ఆయన, ఆసుపత్రి ప్రారంభం వెనుక ఉన్న తల్లిదండ్రుల కోరికలను గుర్తు చేసుకున్నారు. “పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలి అనేది మా అమ్మ కోరిక. అందుకే ఈ ఆసుపత్రిని స్థాపించాం,” అన్నారు.

తండ్రి ఎన్టీఆర్ తనను మెడిసిన్ చదవాలని కోరుకున్న విషయాన్ని వెల్లడించిన బాలయ్య, “మెడిసిన్‌కు హాల్ టికెట్ తెచ్చినా, నాకు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఇప్పుడు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా,” అని గుర్తుచేశారు.

తనపై ఉన్న అహంకార ఆరోపణలపై స్పందిస్తూ, బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అవును నాకు పొగరు ఉంది. ఎందుకంటే నేను నన్నే ముందుగా ప్రేమించుకుంటాను. అది తప్పు కాదు,” అన్నారు. తనకు వచ్చిన పద్మభూషణ్ అవార్డు గురించి మాట్లాడుతూ, “ఇది నాకు వచ్చిన అలంకారం కాదు, నేను చేసిన సేవలకు వచ్చిన గౌరవం,” అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, “మన శరీరం మన అదుపులో ఉండాలి. అదే హిందూ ధర్మం గొప్పతనమైతే, అందరూ బాగుండాలని కోరుకోవడం హిందూ ఇజం గొప్పతనం,” అని స్పష్టం చేశారు బాలకృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *