March 10, 2026

అమరావతి మహిళలపై చేసిన నీచ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఆగ్రహం

విశాఖపట్నం: జూన్ 7
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక పత్రిక రంగంలో జరిగిన ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “నిన్న ఒక పోస్టు చూసి చాలా బాధపడ్డాను. ఒక జర్నలిస్ట్ సాక్షి మీడియాలో మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి” అని అన్నారు. ప్రత్యేకంగా అమరావతి మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. “అమరావతి రైతులు కట్టుకొచ్చిన చీరలు, ఆ ప్రాంత మహిళల గురించి నీచంగా మాట్లాడారు. ఇది అంగీకరించదగిన విషయం కాదు,” అని అన్నారు.

హోం మంత్రి అనిత మాట్లాడుతూ, “అమరావతి అంటే కొన్ని వేల మంది రైతుల త్యాగం ఉంది. 275 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కూడా ప్రభుత్వం కొందరు వ్యక్తుల మాటల్ని సహించుకుంటోంది. ఇదెక్కడి రాజకీయం?” అని మండిపడ్డారు. గతంలో శాసన మండలి ప్రతిపక్ష నేత అమరావతిని శ్మశానంగా చెప్పిన సంగతి గుర్తు చేస్తూ, ప్రస్తుతం జర్నలిస్ట్ క్రిష్ణం రాజు కామెంట్లు జగన్ రెడ్డి అమరావతిపై అక్కసుని ప్రతిబింబిస్తున్నాయి అన్నారు. “జగన్ రెడ్డి అమరావతిని ‘కమరావతి’గా చులకన చేస్తే, అది రాష్ట్ర ప్రగతికి అడ్డుగోడ అవుతుంది,” అని విమర్శించారు.

ఆమె ఆగ్రహంతో, “ఇది రాష్ట్ర ప్రతిష్టకు ముద్ర వేయడమే కాదు, పెట్టుబడులను వెనక్కు నెట్టి వేయడమే. అయితే ఇప్పుడు చంద్రబాబు మళ్లీ వచ్చిన తర్వాతే పెట్టుబడులు రావడం ప్రారంభమయ్యాయి. అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారు,” అని తెలిపారు. అలాగే, కృష్ణంరాజు మాట్లాడుతున్న తీరు హీనంగా ఉందని, “సాక్షాత్తూ భారతిరెడ్డి మీద పోస్ట్లు పెట్టినందుకు కిరణ్‌ను అరెస్ట్ చేయడం గర్వంగా చెప్పుకుంటున్నారని అనిపిస్తోంది,” అని అన్నారు. తిరుపతిలో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారని ఆరోపించారు.

ఈ విషయంలో ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. “ఏపీ ప్రజలు, అమరావతి రైతులు, మహిళలపట్ల చేసిన అపహాస్యానికి జగన్, భారతిలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. దీనిపైన కుట్ర పన్నినవారిపై చర్యలు తీసుకుంటాం,” అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *