April 2, 2026

Amaravathi the capital of AP: జీవించే నగరం ఎక్కడ?

Amaravathi the Capital of AP

ఒక రాజధాని నగర నిర్మాణం అంటే కేవలం భవనాల సముదాయం కాదు; అది భవిష్యత్తుకు మార్గదర్శకం. ప్రపంచ చరిత్రలో రాజులు, రాణులు నిర్మించిన నగరాలు ఉన్నాయి; ఆధునిక ప్రభుత్వాలు రూపకల్పన చేసిన రాజధానులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఘన విజయాలు సాధించాయి. మరికొన్ని వైఫల్యాలకు ఉదాహరణలుగా మిగిలాయి. అయితే ఈ విజయాలు–విఫలాలు అన్నీ ఒకే పాఠం చెబుతున్నాయి…

అంటే, దూరదృష్టి ఉన్న నాయకత్వం రాజధానిని నిర్మించగలదు; కానీ ప్రజల అంగీకారం, పరిపాలనా స్థిరత్వం, ఆర్థిక కార్యకలాపాలు కలిసివచ్చినప్పుడే అది నిలదొక్కుకుంటుంది. ప్రపంచంలో కొత్తగా నిర్మించిన రాజధానులను పరిశీలిస్తే విస్తీర్ణం, వ్యయం, నిర్మాణ కాలం, నిధుల మూలాలు — ఇవన్నీ నగర భవిష్యత్తును నిర్ణయించిన కీలక అంశాలుగా కనిపిస్తాయి.

బ్రెజిల్ రాజధాని బ్రసీలియా సుమారు 5,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. 1956లో ప్రారంభమై 1960లో ప్రారంభ దశ పూర్తయింది. నాలుగేళ్లలో నిర్మాణం జరిగినట్లు చెబుతారు. అప్పటి విలువలో సుమారు 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. నేటి విలువలో ఇది లక్షల కోట్ల రూపాయలకు సమానం. మొత్తం వ్యయం కేంద్ర ప్రభుత్వం భరించింది. ముఖ్యంగా అన్ని మంత్రిత్వ శాఖలను ఒకేసారి అక్కడికి తరలించారు. అధికారులు, నాయకత్వం అక్కడే నివసించారు. దీంతో నగరం వెంటనే పరిపాలనా కేంద్రంగా మారింది. నిర్మాణం వేగంగా జరిగిందనేది నిజం; కానీ ఆ వేగం వెనుక భారీ ప్రభుత్వ పెట్టుబడి, పూర్తి పరిపాలన తరలింపు ఉన్నాయి.

ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా సుమారు 814 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 1913లో నిర్మాణం ప్రారంభమై 1927లో ప్రధాన దశ పూర్తయింది. దాదాపు 14 సంవత్సరాలు పట్టింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. కార్యాలయాలు దశల వారీగా తరలించడంతో అభివృద్ధి కూడా క్రమంగా జరిగింది. ఇది వేగంగా కాకపోయినా స్థిరంగా ఎదిగిన రాజధాని.

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ విస్తీర్ణం సుమారు 906 చదరపు కిలోమీటర్లు. 1960లో ప్రారంభమై 1980ల వరకు అభివృద్ధి కొనసాగింది. దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. కేంద్ర ప్రభుత్వం, విదేశీ సహాయం కలిసి నిధులు సమకూర్చాయి. మౌలిక వసతులు ముందుగా నిర్మించారు. తరువాత పరిపాలన తరలించారు. అధికారులు అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. నగరం క్రమంగా అభివృద్ధి చెందింది.

Read this article also : రష్యా ఖజానా ఖాళీ అవుతోందా? 25 ఏళ్ల తర్వాత Gold నిల్వల విక్రయం!

రాజులు నిర్మించిన నగరాల చరిత్ర కూడా ఇదే చెబుతుంది. జైపూర్ నగరం ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. విశాల వీధులు, వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు ముందుగానే రూపొందించారు. రాజధానిని పూర్తిగా అక్కడికి మార్చారు. వ్యాపారం పెరిగింది. నగరం నిలబెట్టుకుంది. షాజహానాబాద్ నిర్మాణం కూడా రాజధాని తరలింపుతో వేగంగా అభివృద్ధి చెందింది. కోట, బజార్లు, నివాస ప్రాంతాలు సమగ్రంగా నిర్మించారు. పరిపాలన అక్కడికి మారింది. నగరం జీవం పొందింది.

అయితే విఫలమైన నగరాలు కూడా ఉన్నాయి. ఫతేపూర్ సిక్రీ వేగంగా నిర్మించబడింది. అద్భుత నిర్మాణాలు ఉన్నా నీటి సమస్యల వల్ల వదిలేయబడింది. దౌలతాబాద్ రాజధాని మార్పు కూడా నిలబడలేదు. ప్రజల అసౌకర్యం, పరిపాలన సమస్యలు కారణం. అంటే నిర్మాణం మాత్రమే సరిపోదు; స్థిర నివాసం అవసరం.

అయితే అమరావతి సందర్భంలో అత్యంత కీలకమైన ప్రశ్న — పరిపాలన స్థిర నివాసం. రాజధాని ప్రకటించి దాదాపు పన్నెండేళ్లు గడిచినా పరిపాలనా వ్యవస్థ పూర్తిస్థాయిలో అమరావతిలో స్థిరపడలేదు. అధికారులు, నాయకత్వం, సహాయక వ్యవస్థ, ప్రజాప్రతినిధులు ఎక్కవ మంది హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. యేళ్లు గడుస్తున్నా, ఒకే కేంద్రంలో ఉండకపోవడం నగర జీవనాన్ని ప్రభావితం చేస్తున్న అంశంగా కనిపిస్తోంది. వారాంతాల్లో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు కార్యకలాపాలు దాదాపు శూన్యం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాలనా వ్యవస్థ ఆధారపడే పరోక్ష జీవనం కూడా రాజధాని నగర పరిధిలో కనిపించడం లేదు. వారు నిలదొక్కుకోవడానికి తగిన మౌళిక సదుపాయాలు కూడా లేవు. అవసరమైన నిరంతర చైతన్యం కనిపించడం లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు సగం రోజులు పాలనా వ్యవస్థా లేక, జనసంచారమూ లేకపోతే అది రాజధానిగా ఎలా మనగలుగుతుంది?

Read this article also: NATO coalition political crisis ఇరాన్ యుద్ధంలో అమెరికా ఒంటరితనం?

ప్రపంచంలో నిర్మించిన ఇతర రాజధానుల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. బ్రసీలియాలో మంత్రిత్వ శాఖలు, అధికారులు అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. కాన్‌బెర్రాలో కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ అక్కడే స్థిరపడింది. ఇస్లామాబాద్‌లో పరిపాలన పూర్తిగా తరలించబడింది. అధికారులు, నాయకులు అక్కడే నివసించడంతో నగర జీవనం నిరంతరంగా కొనసాగింది. అందుకే ఆ నగరాలు త్వరగా స్థిరపడ్డాయి.

ఇప్పుడు అమరావతి ప్రణాళికను పరిశీలిస్తే విస్తీర్ణం సుమారు 217 చదరపు కిలోమీటర్లు. క్యాపిటల్ రీజియన్ విస్తీర్ణం 8,603 చదరపు కిలోమీటర్లు. మొత్తం అంచనా వ్యయం లక్ష కోట్ల రూపాయలకు పైగా. కానీ అమలు విధానం సంప్రదాయ రాజధానుల మాదిరిగా లేదు. భూమి సమీకరణ, అభివృద్ధి, ప్లాట్ల విక్రయం, తిరిగి పెట్టుబడి — స్వయం సమృద్ధి మోడల్‌గా రూపుదిద్దుకున్న రాజధాని.

అయితే ఈ మోడల్‌లో కీలకమైనది భూముల విలువ పెరగడం, విక్రయాల ద్వారా ఆదాయం రావడం. కానీ ఆదాయం రావాల్సిన ప్రధాన మార్గం ఇప్పటివరకు పూర్తిగా ప్రారంభం కాలేదు. ల్యాండ్ బ్యాంక్ విక్రయాల ద్వారా ₹80,000 కోట్ల నుంచి ₹1 లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ అవి భవిష్యత్ ప్రణాళికలుగానే మిగిలాయి. కార్యాచరణలోకి పూర్తిగా రాలేదు.

ఇక్కడ మరో కీలక అంశం — కేంద్ర ప్రభుత్వ మద్దతు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఫేజ్-1లో ₹15,000 కోట్ల మద్దతు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు విడుదలైన నిధులు సుమారు ₹4,200 కోట్ల పరిధిలోనే ఉన్నాయి. మొత్తం ఖర్చు మాత్రం ఇప్పటికే సుమారు ₹8,000 కోట్ల వరకు వెళ్లినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. అంటే భారీ ముందస్తు పెట్టుబడి లేకుండా అభివృద్ధి దశల వారీగా సాగుతోంది. బ్రసీలియా తరహాలో ఒకేసారి భారీ ప్రభుత్వ పెట్టుబడితో నగరాన్ని నిర్మించే విధానం ఇక్కడ లేదు.

మొదటి దశలోనే సుమారు 33,000 ఎకరాల భూమి సమీకరించినప్పటికీ తిరిగి ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఈ ప్లాట్లపై గృహ నిర్మాణం ప్రారంభమైతేనే నగరీకరణ వేగం పెరుగుతుంది. కానీ మౌలిక వసతులు పూర్తికాకపోవడం వల్ల ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఫలితంగా అమరావతి నిర్మాణం ఒకేసారి భారీ ప్రభుత్వ పెట్టుబడిపై ఆధారపడని, అదే సమయంలో మార్కెట్ ఆధారిత నగరీకరణ కూడా ప్రారంభం కాని మధ్యంతర పరిస్థితిలో నిలిచిపోయినట్టుగా కనిపిస్తోంది.

పైగా ఇప్పటికీ పరిపాలన పూర్తిస్థాయిలో తరలిపోకపోవడం, పెట్టుబడిదారులు స్థిరత్వం కోసం వేచి చూడటం, మౌలిక వసతులు దశల వారీగా నిర్మాణంలో ఉండటం — ఇవన్నీ అభివృద్ధి కాలాన్ని పెంచే అంశాలు. ప్రపంచ అనుభవం చెబుతున్నది — నగరం వెంటనే మహానగరంగా మారదు. ముందుగా పరిపాలన, తరువాత సేవా రంగం, తరువాత వ్యాపారం — ఇలా అభివృద్ధి జరుగుతుంది.

అందుకే అమరావతి 15 సంవత్సరాల్లో మహానగరంగా మారడం కష్టం. 20–30 సంవత్సరాల కాలం సహజం. విధాన స్థిరత్వం లేకపోతే 30–40 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇది నిరాశ కాదు; నగర నిర్మాణం సహజ ప్రక్రియ.

ప్రపంచ చరిత్ర ఒకే విషయం చెబుతోంది: రాజధానులు ప్రకటించబడతాయి; కానీ జీవించే నగరాలు కాలంతో నిర్మితమవుతాయి. అమరావతి కూడా అదే దశలో ఉంది. అది కేవలం పరిపాలనా చిరునామాగా మిగులుతుందా? లేక ప్రజలతో నిండిన మహానగరంగా మారుతుందా? అన్నది — పరిపాలన స్థిర నివాసం, పెట్టుబడుల ప్రవాహం, మౌలిక వసతుల వేగం మీదే ఆధారపడి ఉంది.

అమరావతి ముందు ఉన్న అసలు ప్రశ్న ఇదే:
రాజధాని ఉంది… కానీ జీవించే నగరం ఎక్కడ?

English Summary —

Amaravati Capital: A Capital Without a Living City

The planning of a capital city is not merely about constructing buildings; it is about shaping the future. History shows that capitals succeed when three elements come together — complete administrative relocation, strong financial backing, and sustained human activity. Cities like Brasília, Canberra, and Islamabad developed because governments shifted fully, invested heavily, and created livable ecosystems.

Amaravati, however, follows a different path. The proposed capital area spans about 217 sq km, with a capital region of 8,603 sq km. The estimated cost exceeds ₹1 lakh crore. Unlike other capitals funded directly by governments, Amaravati is designed as a self-sustaining model based on land pooling, infrastructure development, land sales, and reinvestment. But this financial cycle has not yet fully begun. Land monetization expected to generate ₹80,000 crore to ₹1 lakh crore remains largely on paper.

Central government support has also been limited. Though ₹15,000 crore was announced for Phase-1, only about ₹4,200 crore has been released so far. Meanwhile, total expenditure is estimated at around ₹8,000 crore. Around 33,000 acres were pooled, but fully developed returnable plots are yet to be handed over at scale. Without infrastructure, housing construction has not started significantly, delaying urbanization.

Another major concern is administrative presence. Even after more than a decade, governance has not fully shifted. Officials, political leadership, and institutional ecosystems are not permanently based in Amaravati. Weekend activity remains minimal, and the city lacks continuous civic and economic life. In contrast, global capitals grew because administrations relocated and people followed.

As a result, Amaravati appears caught between two models — not a fully government-funded capital, and not yet a functioning market-driven city. This transitional state slows growth.

Global experience suggests capitals do not become metropolitan cities overnight. Administrative shift comes first, followed by services, then commerce. Given current conditions, Amaravati becoming a full-fledged metropolitan city in 15 years is unlikely. A 20–30 year timeline is more realistic; with policy instability, it may take 30–40 years.

The core question remains: Amaravati has been declared a capital — but will it evolve into a living city? That depends on administrative relocation, sustained funding, infrastructure development, and people choosing to live there.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *