March 10, 2026

అమరావతిపై వ్యాఖ్యలను నిరసించిన షర్మిల

అమరావతిపై ‘వేశ్యల రాజధాని’ అని చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది మహిళల మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఉందని ఆమె ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లుగా రాజధాని నిర్మాణం లేకుండా ఉండడం దురదృష్టకరమని పేర్కొన్న షర్మిల, “ఇప్పటికైనా అమరావతిని మన రాజధానిగా నిర్మించుకునే సమయం వచ్చింది” అని స్పష్టం చేశారు.

ఇలాంటి సమయంలో అమరావతిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించదగ్గదేనని అన్నారు. “—- రాజధాని” అనే పదాలు బేస్‌లెస్ (baseless), సెన్స్‌లెస్ (senseless) కామెంట్లని ఆమె అభివర్ణించారు. ఇది చిన్న విషయం కాదు, ఇలాంటి మాటల వల్ల మహిళల గౌరవం దెబ్బతింటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి మీడియా హౌస్‌లో ప్రసారమైన ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ, దాన్ని నడిపిస్తున్న భారతి రెడ్డి తప్పకుండా క్షమాపణ చెప్పాలి. మీడియా హౌస్ అయినా, పార్టీ అయినా ఇటువంటి వ్యాఖ్యలపై తక్షణమే మన్నింపు కోరాల్సిన అవసరం ఉందని షర్మిల డిమాండ్ చేశారు. “క్షమాపణ చెప్పడంలో నామోషీ ఏముంది? ఇది బాధ్యతగా తీసుకోవాల్సిన విషయం” అని ఆమె స్పష్టం చేశారు.

వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కూడా ఈ విషయంపై బాధ్యత ఉండాలన్నారు. మహిళల మనోభావాలను తాకే విధంగా వ్యాఖ్యలు జరిగినప్పుడు ఆయన సైలెంట్‌గా ఉండడం శోచనీయం అని విమర్శించారు. “ఇవన్నీ అమరావతిపై ఎలాంటి ప్రభావం చూపలేవు. అక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారు” అని షర్మిల స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *