March 16, 2026

ఇరాన్ సంక్షోభంలో భారత్ మౌనం: బలహీనతా?…వ్యూహాత్మక మౌనమా?

Indian strategy on Iran

“The supreme art of war is to subdue the enemy without fighting,” అని ప్రాచీన చైనా యుద్ధనీతిజ్ఞుడు Sun Tzu చెప్పారు. యుద్ధంలో ప్రతి పోరాటంలోకి దూసుకెళ్లడం విజయం కాదు; ఎప్పుడు మౌనం పాటించాలో తెలుసుకోవడమే అసలు వ్యూహం. అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ Iran చుట్టూ సంక్షోభం ముదురుతోంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు తమ వైఖరిని ప్రకటిస్తున్నాయి. కానీ India మాత్రం జాగ్రత్తగా మౌనం పాటిస్తోంది.

ఈ మౌనం బలహీనతా? వ్యూహమా?

చరిత్ర చెబుతున్న స్నేహం

గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు ఇరాన్‌తో ఉన్న సంబంధం భిన్నమైనది. పర్షియన్ నాగరికత ప్రభావం భారత ఉపఖండంపై శతాబ్దాలుగా ఉంది. మొఘల్ కాలంలో పర్షియన్ భాష రాజదర్బార్ల అధికార భాషగా నిలిచింది. సాహిత్యం, వాస్తు, సంస్కృతిలో ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది.

అంటే Saudi Arabia లేదా United Arab Emirates వంటి దేశాలతో భారత సంబంధాలు ప్రధానంగా ఇంధనం, ఉపాధి, వాణిజ్యంపై ఆధారపడితే—ఇరాన్‌తో ఉన్న బంధం మాత్రం చరిత్ర, సంస్కృతి, వ్యూహం అన్న మూడు స్థాయిల్లో కొనసాగుతోంది.

ఈ బంధానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఇచ్చింది Chabahar Port. ఈ పోర్ట్ అభివృద్ధిలో భారత్ పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా పాకిస్తాన్‌ను దాటకుండా ఆఫ్ఘానిస్తాన్, మధ్య ఆసియా మార్కెట్లకు చేరే మార్గం భారత్‌కు లభిస్తుంది.

అంటే భావోద్వేగం మాత్రమే కాదు—వ్యూహాత్మక అవసరం కూడా రెండు దేశాలను దగ్గర చేసింది.

Read this editorial also: గల్ఫ్ గోరు చుట్టుపై రోకటి పోటు!

అయినా రష్యా మాదిరి మద్దతు ఎందుకు లేదు?

ఇక్కడ ఒక కీలక పోలిక కనిపిస్తుంది. Russia–Ukraine War ప్రారంభమైనప్పుడు పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్ Russia నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించలేదు. తక్కువ ధరలకు ముడి చమురు కొనుగోలు చేస్తూ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంది. అదే సమయంలో రష్యాకు తోడ్పాటునిచ్చింది.

అంటే ఆ సందర్భంలో భారత్ ఒక విధంగా రష్యాకు పరోక్ష మద్దతు ఇచ్చినట్టే.

కానీ అదే స్థాయి ధైర్యం ఇరాన్ విషయంలో కనిపించడంలేదు. చేయాలని ఉన్నా చేసే పరిస్థితి లేదు. కారణం కేవలం ఆంక్షలు మాత్రమే కాదు—విదేశాంగ తత్వాల్లోని తేడా కూడా.

ఇస్లామిక్ ప్రపంచ రాజకీయాలు

గత కొన్నేళ్లుగా ఇస్లామిక్ ప్రపంచంలో నాయకత్వం కోసం పోటీ కొనసాగుతోంది. ఆ పోటీలో Turkey, Pakistan, Iran,Saudi Arabia తమ ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాయి.

టర్కీ అధ్యక్షుడు Recep Tayyip Erdoğan తరచుగా అంతర్జాతీయ వేదికలపై ముస్లిం ప్రపంచ సమస్యలపై ఘాటుగా మాట్లాడతారు. ప్రత్యేకంగా Kashmir అంశంపై టర్కీ బహిరంగంగా స్పందించింది.

ఇరాన్ ధోరణి కొంచెం వేరుగా ఉంటుంది. అది పూర్తిగా ఘర్షణ మార్గాన్ని ఎంచుకోదు. అలాగని పూర్తిగా మౌనం కూడా పాటించదు. అప్పుడప్పుడు కాశ్మీర్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇస్లామిక్ ప్రపంచ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంది.

Read this editorial also: హెర్ముజ్ జలసంధి కాదు — నౌకలకు నరక ద్వారం

“ఇస్లామిక్ నాటో” నీడ

ఇస్లామిక్ ప్రపంచ రాజకీయాల్లో మరో అంశం కూడా ఉంది. 2015లో Saudi Arabia ఆధ్వర్యంలో ఏర్పడిన Islamic Military Counter Terrorism Coalition ను కొందరు “ఇస్లామిక్ నాటో”గా అభివర్ణించారు. ఈ కూటమిలో అనేక ముస్లిం దేశాలు చేరినా Iran మాత్రం ఇందులో భాగం కాదు.

సౌదీ–ఇరాన్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు దీనికి కారణం. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ ప్రపంచంలో ఆధిపత్యం కోసం సౌదీ, టర్కీ, ఇరాన్ మధ్య పోటీ కొనసాగుతోంది. అలాంటి పరిస్థితిలో ఇరాన్ పూర్తిగా మౌనం పాటించడం కంటే అప్పుడప్పుడు కాశ్మీర్ వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా తన స్థానాన్ని కాపాడుకుంటూ చేస్తోంది.

ఎక్కడో అపనమ్మకం

ఇక్కడే భారత్‌కు ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహం ఉన్నా—పూర్తి నమ్మకం లేదు.

కాశ్మీర్ అంశంపై కొన్ని సందర్భాల్లో ఇరాన్ నాయకత్వం చేసిన వ్యాఖ్యలు న్యూఢిల్లీకి అసౌకర్యాన్ని కలిగించాయి. 2019లో జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై స్పందిస్తూ అప్పటి ఇరాన్ అధ్యక్షుడు Hassan Rouhani అక్కడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి Javad Zarif కూడా భారత నిర్ణయాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

భారత్‌కు ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే కాశ్మీర్‌ను న్యూఢిల్లీ పూర్తిగా అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తుంది. అందుకే

ఇరాన్‌తో భారత్‌కు స్నేహం ఉంది; కానీ అంత నమ్మకం లేదు. అందుకే ఈ సంక్షోభంలో న్యూఢిల్లీ మౌనం కేవలం జాగ్రత్త మాత్రమే కాదు—ఒక రాజకీయ సందేశం కూడా.

Read this editorial also: గాలిలో దీపం — గల్ఫ్‌లో వలస జీవితం

మౌనం వెనుక కనిపించని సహకారం

అయితే భారత్–ఇరాన్ సంబంధాలను కేవలం దూరంగా ఉన్నట్లు కూడా చూడలేం. బయటకు కనిపించేది మౌనమే అయినా లోపల పరస్పర సహకారం కొనసాగుతూనే ఉంటుంది.

ఇంతటి ఉద్రిక్తతల నడుమ కూడా Strait of Hormuz ప్రాంతం నుంచి రవాణకు భారత నౌకలకు ఇరాన్ అనుమతించింది. మరోవైపు భారత తీరానికి వచ్చిన ఇరాన్ నావికులకు మానవతా కారణాలతో భారత్ ఆశ్రయం కల్పించిన సందర్భాలు ఉన్నాయి.

అంటే బంధం పూర్తిగా తెగిపోలేదు. కానీ బహిరంగంగా కనిపించేది మాత్రం జాగ్రత్త. మౌనం.

భారత్–ఇరాన్ సంబంధం ఒక విరుద్ధ సమీకరణ. ఒకవైపు చరిత్ర, సంస్కృతి, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాలు, United States, Israel వంటి శక్తులతో ఉన్న బలమైన సంబంధాల ప్రయోజనాలూ ఉన్నాయి.

అందుకే న్యూఢిల్లీ ఎంచుకున్న మార్గం—ఒక పక్షానికి పూర్తిగా అండగా నిలబడటం కాదు; అన్ని సంబంధాలను సమతుల్యంగా కొనసాగించే ప్రయత్నం.

యుద్ధ వ్యూహంలో ఒక సూత్రం ఉంది:

“ప్రతి యుద్ధాన్ని గెలవడం గొప్పతనం కాదు; అవసరం లేని యుద్ధాన్ని తప్పించుకోవడమే నిజమైన విజయం.”

ఇరాన్ సంక్షోభంలో భారత్ మౌనం కూడా బహుశా అలాంటి లెక్కలేసిన అడుగే కావచ్చు. కానీ ఆ మౌనం ఎంతకాలం వ్యూహంగా నిలుస్తుందో—అదే అసలు ప్రశ్న.

English Summary

India’s silence during the ongoing tensions involving Iran has raised several questions in diplomatic circles. While India shares historical and strategic ties with Tehran, it also maintains crucial partnerships with countries across the Gulf and the West.

This editorial examines the complex balance in India’s foreign policy—its energy interests, the strategic importance of Chabahar Port, and the geopolitical realities shaping New Delhi’s cautious approach.

India’s silence, therefore, may not simply be diplomatic restraint. It reflects the limits of trust, the pressures of global alliances, and the delicate balance New Delhi must maintain in an increasingly polarized Middle East.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *