ముస్తాబవుతున్న భాగ్యనగరం… ఎందుకో తెలుసా.?
నూతన సంవత్సర వేడుకలను మరింత కొత్తగా, ఉత్సాహంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. 2025కి గుడ్‌బై చెప్పి 2026కి స్వాగతం పలికేందుకు భాగ్యనగరం హైదరాబాద్ ముస్తాబవుతోంది. పబ్‌లు, క్లబ్‌లు, ఈవెంట్ వేదికలన్నీ న్యూ ఇయర్ సందడితో కళకళలాడనున్నాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీసులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈవెంట్స్ నిర్వహించే పబ్‌లు, క్లబ్‌లు తప్పనిసరిగా 15 రోజుల ముందే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి. పార్టీల్లో అశ్లీల నృత్యాలు నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు, డీజేలు అనుమతిలేవు. రాత్రి ఒకటి తర్వాత ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తప్పవని తెలిపారు. బాణసంచా పూర్తిగా నిషేధం. పబ్‌లు, బార్లలో మైనర్లకు ఎంట్రీ ఉండకూడదని ఆదేశించారు.
మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలుశిక్షతో పాటు లైసెన్స్ సస్పెన్షన్ ఉంటుంది. మైనర్లు వాహనాలు నడిపితే పూర్తి బాధ్యత వాహన యజమానిదేనని హెచ్చరించారు. నగరవ్యాప్తంగా షీటీమ్స్‌తో పాటు ప్రత్యేక పోలీసు బృందాలు నిఘా చేపడతాయి. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.