
భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న జల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై (Indus Waters Treaty) భారత్ తన వైఖరిని మరింత కఠినతరం చేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ, జమ్మూ కాశ్మీర్‌లో దశాబ్దాలుగా మూలన పడిన తులబుల్ నౌకా ప్రాజెక్టు (Tulbul Navigation Project) దుమ్ముదులుపుతున్నారు. ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింధు ఒప్పందం సస్పెన్షన్ తర్వాత భారత్ చేపట్టిన మొట్టమొదటి కీలక చర్య ఇది.
తుల్‌బుల్ ప్రాజెక్టుతో భారత్ దూకుడు వైఖరి
తుల్‌బుల్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక నివేదిక (Detailed Project Report) తయారీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డిపిఆర్ తయారీకి ఏడాది సమయం పట్టవచ్చని, అనంతరం అధికారులు నివేదికను సమర్పిస్తారని తెలుస్తోంది. ఈ పరిణామం ప్రాంతీయ జల వనరులపై భారత్‌కు గల ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించే నూతన విధానాన్ని సూచిస్తుంది. ఇది పాకిస్థాన్ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే కొత్త భారత్ విధానాన్ని ప్రతిబింబిస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడున్నారు.
తుల్‌బుల్ నౌకా ప్రాజెక్టును జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో జీలం నదిపై జల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రూపొందించారు. వులార్ సరస్సు (Wular Lake) నుండి నీటి ప్రవాహాన్ని నియంత్రించి, తక్కువ నీరు ఉండే కాలంలో నీటిని సరఫరా చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 300,000 ఎకరాల అడుగుల నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 4.5 అడుగుల వెడల్పుతో ఉండే ఆనకట్ట శ్రీనగర్ మరియు బారాముల్లా మధ్య రవాణాకు కూడా ఇది దోహదపడుతుంది. జలవిద్యుత్ ఉత్పత్తి, అంతర్గత రవాణా వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తాయి.
ప్రాజెక్టు చరిత్ర: అభ్యంతరాలు, పునరుద్ధరణ ప్రయత్నాలు
ఈ ప్రాజెక్టు పనులు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం, 1984లో ప్రారంభమయ్యాయి. అయితే, పాకిస్థాన్ ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి. 1986లో పనులు తిరిగి ప్రారంభమైనప్పుడు, పాకిస్థాన్ సింధు నదీ జలాల సంఘం (Indus Waters Commission) వద్ద ఆందోళనలు లేవనెత్తింది. చివరకు, 1987లో అనేక అభ్యంతరాల అనంతరం భారత్ ఈ ప్రాజెక్టును విరమించుకుంది.
సంవత్సరాల తర్వాత, 2010లో అప్పటి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించింది. 2012లో ఉగ్రవాదులు ప్రాజెక్టు పనులను లక్ష్యంగా చేసుకున్నారు. అయినప్పటికీ, రాజకీయంగా కొన్ని చర్చలు జరిగినా, క్షేత్ర స్థాయిలో గణనీయమైన పురోగతి ఏమీ సాధించలేకపోయింది.
సింధు ఒప్పందం: భారత్ దృక్పథం
తుల్‌బుల్ ప్రాజెక్టు సింధు నదీ జలాల ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తుందని పాకిస్థాన్ వాదిస్తుండగా, భారత్ దీనిని అంగీకరించడం లేదు. ముందుగా, తన భౌగోళిక సరిహద్దుల్లోని సహజ వనరులతో ఏదైనా చేయడానికి తనకు పూర్తి హక్కు ఉందని న్యూఢిల్లీ స్పష్టం చేస్తోంది. రెండవది, సింధు నదీ జలాల ఒప్పందమే పశ్చిమ నదులను వినియోగం కాని (non-consumptive) ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే హక్కును భారత్‌కు కల్పించింది. తుల్‌బుల్ ప్రాజెక్టు పశ్చిమ నదులలో ఒకటైన జీలంపై ఉన్నందున, భారత్ లక్ష్యాలకు ఇది సంపూర్ణంగా అనుగుణంగా ఉందని భారత ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ పరిణామం భవిష్యత్తులో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జల వివాదాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. భారత్ తన సార్వభౌమత్వాన్ని, జల హక్కులను పటిష్ఠం చేసుకోవడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు ఈ చర్య స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ఒక ప్రాజెక్టు పునరుద్ధరణ మాత్రమే కాదు, ప్రాంతీయ భద్రత మరియు వనరుల నిర్వహణపై విస్తృత ప్రభావాన్ని చూపే నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ స్పందన, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.