సైబర్ నేరాలు రోజుకో రూపం దాల్చుతున్నాయి. బ్యాంకు అధికారులుగా ఆర్బీఐ అధికారులుగా చెప్పుకునే పిన్ నంబర్లు, ఆధార్ నంబర్లు కొట్టేసే సైబర్ కేటుగాళ్ళు నేరుగా సిబిఐ, సిఐడి, పోలీసు అధికారులమంటూ కింది స్థాయి వారు మొదలుకుని రాజకీయ నాయకులను కూడా మోసం చేస్తున్నారు. కేసులున్నాయ్.. తమతో సెటిల్ చేసుకోవాలని లేదంటే అరెస్టు తప్పదని మోసగిస్తున్నారు. దీనిపై ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం స్పందించారు.
ఫోన్‌లో బెదిరించి ఏ ప్రభుత్వ సంస్థ డబ్బు అడగదని, ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తులు పోలీసులు, సీబీఐ, ఆర్‌బీఐ లేదా నార్కోటిక్స్ అధికారులుగా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.
ఇవి సైబర్ కేటుగాళ్ళు చేసే పనేనని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఇలాంటి మోసాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని అన్నారు.
ఆదివారం అంటే అక్టోబర్ 27న ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ‘డిజిటల్ అరెస్ట్’ మోసం ఎలా జరుగుతుందో ప్రధాని మోదీ వివరించారు. ‘మీపై కేసులు నమోదయ్యాయి. సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. మీపై ఉన్న కేసులు మాఫీ కావాలంటే డబ్బులు ఇవ్వా’లంటూ కేటుగాళ్ళు మభ్యపెడుతున్న అంశాన్ని ప్రధాని పూసగుచ్చినట్లు వివరించారు.
మొదటి దశలో మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారని, రెండవ దశలో భయం కలిగే వాతావరణాన్ని కలిగిస్తారని, మూడవ దశలో ఒత్తిడి చేసి ఆలోచించి, అర్థం చేసుకునే శక్తిని కోల్పోయే స్థితిలో బ్యాంకుల్లో ఉన్న డబ్బులు కొల్లగొడుతున్నారని తెలిపారు. దీంతో ప్రజలు చాలా భయపడుతున్నారని అన్నారు. ఎక్కువగా వృద్ధులను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. ఎవరికైనా ఇలాంటి కాల్ వస్తే భయపడవద్దని ప్రధాని మోదీ దేశప్రజలను కోరారు.
మూడు దశల్లో తిప్పికొట్టండి.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ చాలా వరకు ఆపివేయాలని, ఆలోచించాలని కోరారు. వీలైతే, స్క్రీన్‌షాట్‌లు తీసుకోవాలని, కాల్స్ రికార్డింగ్ లు చేయాలని సూచించారు.
ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ ద్వారా బెదిరింపులు చేయదనే విషయం, డబ్బు డిమాండ్ చేయదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఇలాంటి మోసాలను అరికట్టేందుకు నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయాలని లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రధాని మోడీ ప్రజలను కోరారు. అలాగే జాబ్స్, లోన్స్, కొరియర్ పేరిట వచ్చే ఫ్రాడ్‌కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు.