
తిరుమల శేషాచలం అడవుల్లో పామును పోలి ఉండే అరుదైన కొత్త జాతి జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త జాతి స్కింక్‌కు (నలికిరి) ‘డెక్కన్ గ్రాసైల్ స్కింక్’ అని నామకరణం చేశారు. ఈ పరిశోధన శేషాచలం, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల జీవవైవిధ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
తిరుపతి, జూన్ 14: తిరుమల శేషాచలం (Tirumala Seshachalam) అడవుల్లో పామును పోలి ఉండే (Snake-like) అరుదైన కొత్త జాతి జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్‌లోని జీవావరణంలో ఈ అరుదైన కొత్త జాతి స్కింక్‌ను (నలికిరి) కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Zoological Survey of India – ZSI) డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ (Dr. Dhriti Banerjee) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తరువాత ఈ అరుదైన జీవికి ‘డెక్కన్ గ్రాసైల్ స్కింక్’ (Deccan Gracile Skink) గా నామకరణం చేశారు. పాక్షిక పారదర్శక కనురెప్పలు, విభిన్న చారలతో అచ్చం పాము పోలికలతో ఈ జీవి ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం, తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో (Amrabad Tiger Reserve) మాత్రమే ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తున్నాయని, జీవవైవిధ్యానికి (Biodiversity) ప్రతీకగా ఈ పరిశోధన నిలుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
ఈ పరిశోధనకు ZSIకి చెందిన హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం, కోల్‌కతాలోని రెప్టిలియా విభాగం, లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం (Natural History Museum, London) శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేశారని ZSI ప్రతినిధి డాక్టర్ దీపా జైస్వాల్ (Dr. Deepa Jaiswal) ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిష్కరణ శేషాచలం అటవీ ప్రాంతం యొక్క ప్రత్యేకమైన జీవావరణాన్ని, మరియు అక్కడ ఇంకా కనుగొనబడని జీవరాశులు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.