
- కుటుంబం ఎదుటే బలోచ్ జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దారుణం
విలేకరులు ప్రజల గొంతుక అంటారు. వాళ్లు శబ్దం చేస్తే – శాసన సభలే చలించాలి, కానీ బలోచిస్థాన్‌లో నిశ్శబ్దంగా జరగుతున్న హత్యలపై ప్రపంచానికి పట్టడం లేదు. నిజాన్ని రాయడం ఒక నేరంగా మారిన ఆ దేశంలో… పత్రికా స్వేచ్ఛ చీకటిలో కలసిపోతోంది. తాజాగా అబ్దుల్ లతీఫ్ బలోచ్ అనే ధైర్యవంతుడైన బలోచ్ జర్నలిస్ట్‌నుతుపాకీకి బలి తీసుకున్నారు. ఇది కేవలం ఓ విలేకరి హత్య మాత్రమే కాదు,బలోచీలపై సాగుతున్న ‘కిల్ అండ్ డంప్’ విధానానికి నిండైన నిదర్శనం.
పాకిస్థాన్ దేశంలోని బలోచిస్థాన్ ప్రావిన్సులో బలమైన పత్రికా ప్రవాహాన్ని కొనసాగిస్తూ వచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ అబ్దుల్ లతీఫ్ బలోచ్ శనివారం తెల్లవారుజామున మష్కేలోని తన నివాసంలోనే హత్యకు గురయ్యారు. తన భార్య మరియు చిన్న పిల్లల ముందే కాల్చి చంపబడ్డారు. ఈ దాడిని బలోచ్ యక్జెహ్తి కమిటీ (BYC) తీవ్రంగా ఖండించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 3 గంటల ప్రాంతంలో, సైన్యం మద్దతుతో పనిచేసే సాయుధ బృందాలు లతీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విరుచుకు పడ్డాయి.
అబ్దుల్ లతీఫ్ బలోచ్‌ను బలోచిస్థాన్ ప్రాంతంలో బలవంతపు అదృశ్యాలు, అక్రమ హత్యలు, సైనిక దాడులు మొదలైన మానవ హక్కుల ఉల్లంఘనలపై ధైర్యంగా వ్రాసే జర్నలిస్ట్‌గా గుర్తించారు. ఆయన రచనలు బలోచ్ ప్రజల నిత్య జీవిత సత్యాలను వెలుగులోకి తెచ్చాయి. అలాంటి ధైర్యవంతుడిని హత్య చేయడమే కాకుండా, కుటుంబం ఎదుటే చంపడమనేది మానవత్వానికి వ్యతిరేకమైన క్రూర చర్యగా చర్చకు వస్తోంది.
మొదటి దెబ్బ ఇది కాదు. గత నెలల్లో ఆయన కుమారుడు సైఫ్ బలోచ్‌తో పాటు మరో ఏడు కుటుంబ సభ్యులను కూడా భద్రతా బలగాలు కిడ్నాప్ చేశాయి. అనంతరం మృతదేహాలుగా తేలారు. ఈ మౌలిక హక్కుల ఉల్లంఘనల శృంఖలను “కిల్ అండ్ డంప్ పాలసీ”గా పాకిస్థాన్ పౌర హక్కుల కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. ఈ విధానం బలోచీల గళాన్ని అణచేందుకు, వారి హక్కులను ఖూనీ చేయడానికే అని స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బలోచ్ ఉమెన్ ఫోరమ్ సభ్యురాలు షలీ బలోచ్ మాట్లాడుతూ, ఈ హత్యలు బలోచ్ ప్రజలపై సాగుతున్న వ్యవస్థాపిత హింస భాగమేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థలు ఇప్పటికైనా స్పందించకపోతే — బలోచిస్థాన్ భూమిపై మరిన్ని కుటుంబాలు చీకట్లోకి కలసితాయని హెచ్చరించారు.
ఈ దారుణ హత్యను జాతీయ, అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా సంస్థలు తీవ్రంగా ఖండించాయి. బలోచిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చేందుకు వీలు కల్పించాలని కోరుతున్నాయి.
పాకిస్థాన్‌లోని పత్రికా స్వేచ్ఛకు మిగిలిందల్లా భయం, నిశ్శబ్దం, రక్తపు మరకలు.